- ఉపాధి సృష్టి వర్సెస్ తాత్కాలిక సంక్షేమం.. ఏది స్థిర పరిష్కారం?
- ఎన్నికల ముందు ఉచితాల ప్రకటనలపై ప్రశ్నల వర్షం
- రెవెన్యూ లోటుతో రాష్ట్రాలు ఎలా ముందుకు?
- సంక్షేమం, అభివృద్ధి మధ్య సమతుల్యత అవసరం
- ఎన్నికల హామీలు, ఖాళీ ఖజానాలు
- రాష్ట్రాల భవిష్యత్ దిశ ఏమిటి?
- సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం
న్యూ ఢిల్లీ సాక్షర: రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటిస్తున్న ఉచిత పథకాలు దేశ ఆర్థిక వృద్ధికి ఆటంకమవుతాయని సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్యా బాగ్చి, జస్టిస్ విపుల్ పంచోలితో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఉచిత ఆహారం, సైకిళ్లు, విద్యుత్తు వంటి పథకాల కంటే ఉద్యోగాలు, ఉపాధి అవకాశాల సృష్టిపై దృష్టి సారించాలని సూచించింది. ఆర్థిక స్థిరత్వాన్ని పక్కనబెట్టి భారీ ఉచితాల ప్రకటనలు చేయడం సరైన పద్ధతి కాదని వ్యాఖ్యానించింది. తమిళనాడులో డీఎంకే ప్రభుత్వ ఉచిత విద్యుత్ ప్రకటనపై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు వెలువడ్డాయి. వినియోగదారుల ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా రాష్ట్రంలోని అందరికీ ఉచిత విద్యుత్ అందించేలా ప్రతిపాదించిన నేపథ్యంలో దాఖలైన పిటిషన్‌ను ధర్మాసనం విచారించింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పరిగణలోకి తీసుకోకుండా ఇలాంటి నిర్ణయాలు ఎలా తీసుకుంటారని ప్రశ్నించింది. కరెంట్ బిల్లులు చెల్లించలేని పేద కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందించడం ఒక విషయం అయితే, ఆర్థికంగా బలమైన వర్గాలకు కూడా అదే సౌకర్యం కల్పించడం సమంజసం కాదని వ్యాఖ్యానించింది. చాలా రాష్ట్రాల్లో రెవెన్యూ లోటు పెరుగుతోందని, అప్పుల భారంతో ప్రభుత్వాలు నడుస్తున్నాయని ధర్మాసనం గుర్తుచేసింది. ఇలాంటి పరిస్థితుల్లో విస్తృత స్థాయిలో ఉచిత పథకాల అమలు ఆర్థిక వ్యవస్థపై మరింత ఒత్తిడిని పెంచుతుందని అభిప్రాయపడింది. అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక వసతుల నిర్మాణం, ఉపాధి సృష్టి వంటి రంగాలకు నిధులు కేటాయించాల్సిన సమయంలో భారీ ఉచితాల వల్ల వనరులు తగ్గిపోతాయని వ్యాఖ్యానించింది. ఎన్నికలకు ముందు ఉచిత పథకాల ప్రకటనలపై కూడా సుప్రీంకోర్టు ప్రశ్నలు లేవనెత్తింది. ఎన్నికల సమయంలో ప్రజలను ఆకర్షించేందుకు ఉచితాల ప్రకటనలు పెరుగుతున్నాయా అనే అంశాన్ని పరిశీలించింది. అన్నీ ఉచితంగా ఇస్తూ పోతే అభివృద్ధి కార్యక్రమాలకు అవసరమైన నిధులు ఎక్కడి నుంచి వస్తాయని ప్రశ్నించింది. సంక్షేమం అవసరమే అయినప్పటికీ, అది లక్ష్యబద్ధంగా ఉండాలని సూచించింది. ఈ పిటిషన్‌పై కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తూ, సమగ్ర విధానపరమైన దృష్టికోణం అవసరమని ధర్మాసనం పేర్కొంది. సంక్షేమం, ఆర్థిక బాధ్యత, అభివృద్ధి అంశాలను సమన్వయంతో ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. మొత్తంగా ఉచిత పథకాల అమలు దేశ ఆర్థిక వృద్ధిపై ప్రభావం చూపుతుందా అన్న ప్రశ్న ఇప్పుడు జాతీయ చర్చగా మారింది. పేదలకు రక్షణ కల్పించడం ఒకవైపు అవసరమైతే, ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడటం మరోవైపు ముఖ్యమైంది. సంక్షేమం మరియు అభివృద్ధి మధ్య సమతుల్యత సాధించడమే రాష్ట్రాల ముందున్న ప్రధాన సవాల్‌గా కనిపిస్తోంది.
— ARUGULA POSHETTYNirmal Dist Staffer
Advertisement