ముంబై: వివాదాల మధ్య తెరకెక్కిన ది కేరళ స్టోరీ 2 చిత్రానికి సెన్సార్ మండలి నుంచి అనుమతి లభించింది. కేంద్ర చిత్ర ప్రమాణాల మండలి యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేయడంతో 14 ఏళ్లు పైబడిన వారు తల్లిదండ్రుల పర్యవేక్షణలో ఈ చిత్రాన్ని వీక్షించవచ్చని వెల్లడైంది. దీంతో సినిమా విడుదలకు మార్గం సుగమమైంది. ఇటీవల మనోజ్ బాజ్‌పేయి నటించిన ఘూస్‌ఖోర్ పండత్ చిత్రం శీర్షికపై సుప్రీంకోర్టు ఆంక్షలు విధించిన నేపథ్యంలో, మరో వివాదాస్పద చిత్రమైన ‘ది కేరళ స్టోరీ 2’కు అనుమతి లభించడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ చిత్ర నిర్మాత విపుల్ అమృత్‌లాల్ షా స్పందిస్తూ, తమ కథలోని అంశాలను సెన్సార్ మండలి విశ్వసించిందని తెలిపారు. బోర్డు సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, సినిమా సమాజంలో చర్చకు దారితీసే అంశాలను ప్రస్తావిస్తుందని అన్నారు. మత మార్పిడి వంటి సున్నితమైన అంశాలను ప్రస్తావిస్తూ తెరకెక్కిన ఈ చిత్రంపై ఇప్పటికే రాజకీయ వర్గాల్లో స్పందనలు వచ్చాయి. పినరయి విజయన్ ఈ చిత్రాన్ని విమర్శిస్తూ, ఇది రాష్ట్ర ప్రతిష్ఠను దెబ్బతీసే విధంగా ఉందని వ్యాఖ్యానించారు. లౌకిక విలువలకు విఘాతం కలిగించే ప్రయత్నమని ఆరోపించారు. అయితే నిర్మాత విపుల్ షా మాత్రం ఈ సినిమా యువతకు అవగాహన కల్పించేందుకు రూపొందించిందని స్పష్టం చేశారు. దర్శకుడు కామఖ్య నారాయణ్ సింగ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో ఉల్కా గుప్త, అదితి భాటియా, ఐశ్వర్య ఓజా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 27, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. వివాదాల మధ్య వస్తున్న ఈ సినిమా ప్రేక్షకుల్లో ఏ విధమైన స్పందనను రాబడుతుందో చూడాల్సి ఉంది.
— ARUGULA POSHETTYNirmal Dist Staffer
Advertisement