- పేరును దుర్వినియోగం చేస్తున్న సంస్థలపై దేశవ్యాప్త ఆదేశాలు
- రెండు వారాల్లో చర్యల నివేదిక ఇవ్వాలని స్పష్టం
- ఢిల్లీ, కర్ణాటక అధికారులకు ప్రత్యేక సూచనలు
న్యూఢిల్లీ సాక్షర: తమ పేరును పోలిన పేర్లతో రిజిస్టర్ అయి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న నకిలీ సంస్థలు, వ్యక్తులపై జాతీయ మానవ హక్కుల కమిషన్ తీవ్రంగా స్పందించింది. ఇలాంటి సంస్థలపై దేశవ్యాప్తంగా కఠిన చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది. తీసుకున్న చర్యలపై రెండు వారాల్లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది. ఇటీవల తమ దృష్టికి వచ్చిన ఘటనను కమిషన్ ప్రస్తావించింది. ఢిల్లీ ప్రభుత్వంతో రెండు వేల ఇరవై రెండులో ‘నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్’ పేరుతో ఓ స్వచ్ఛంద సంస్థ రిజిస్టర్ అయిందని ఫిర్యాదులు అందినట్లు తెలిపింది. ఆ సంస్థకు నీతి ఆయోగ్, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖల గుర్తింపు ఉందని ప్రచారం చేసుకుంటోందని వెల్లడించింది. కర్ణాటకకు చెందిన ఒక వ్యక్తి ఆ సంస్థకు రాష్ట్ర చైర్మన్‌గా వ్యవహరిస్తున్నట్లు తేలిందని పేర్కొంది.ఈ వ్యవహారంపై సుమోటోగా విచారణ చేపట్టిన కమిషన్, ఇలాంటి మోసపూరిత పేర్లు ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నాయని అభిప్రాయపడింది. తమ సంస్థలో భాగమని లేదా గుర్తింపు పొందిన సంస్థలని ప్రజల్లో భ్రమ కల్పించడం వల్ల కమిషన్ విశ్వసనీయత దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేసింది. అంతేకాకుండా నిధుల దుర్వినియోగానికి దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలు, డీజీపీలకు నోటీసులు జారీ చేసి, పేరును దుర్వినియోగం చేస్తున్న సంస్థలను గుర్తించి వారి రిజిస్ట్రేషన్లు రద్దు చేయాలని ఆదేశించింది. ముఖ్యంగా ఢిల్లీలో రిజిస్టర్ అయి కర్ణాటకలో కార్యకలాపాలు సాగిస్తున్న సంస్థపై తీసుకున్న చర్యల వివరాలను రెండు వారాల్లో సమర్పించాలని ఆ రాష్ట్రాల ఉన్నతాధికారులను కోరింది.
— ARUGULA POSHETTYNirmal Dist Staffer
Advertisement