- అనైతిక వినియోగానికి అపరిమిత అవకాశాలపై హెచ్చరిక
- మానవ విలువలతోనే సాంకేతికతకు సరైన దిశ
- పారదర్శక భద్రతా నియమాలపై ప్రధాని సూచనలు
న్యూఢిల్లీ సాక్షర: ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌లో అనైతిక ప్రవర్తనకు అపరిమిత అవకాశాలు ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అందుకే ఏఐ వినియోగానికి సమగ్ర మార్గరేఖను రూపొందించడం అత్యవసరమని ఆయన పేర్కొన్నారు. మానవ విలువలు, సరైన మార్గదర్శకత్వం లేకుండా సాంకేతికతను వినియోగిస్తే అది స్వీయ విధ్వంసానికి దారితీస్తుందని హెచ్చరించారు. ఏఐ ఇంపాక్ట్ సదస్సు 2026లో భాగంగా నిర్వహించిన నాయకుల ప్లీనరీ సమావేశంలో ప్రసంగించిన ప్రధాని, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌కు స్పష్టమైన దిశ, బాధ్యతాయుత వ్యవస్థ అవసరమని చెప్పారు. డేటా సార్వభౌమత్వాన్ని గౌరవిస్తూ పారదర్శక భద్రతా నియమాలను రూపొందించాలని సూచించారు. సాంకేతిక పురోగతితో పాటు నైతిక బాధ్యత కూడా సమానంగా ఉండాలని స్పష్టం చేశారు. “భారత్ బుద్ధుడు జన్మించిన దేశం. సరైన ఉద్దేశం ఉంటేనే సరైన నిర్ణయాలు ఉంటాయని బుద్ధుడు చెప్పారు. అందుకే అందరూ కలిసి ఏఐ వినియోగంపై సమగ్ర దృక్పథంతో ముందుకు రావాలి” అని మోదీ పేర్కొన్నారు. ఏఐను దుర్వినియోగం చేసే అవకాశాలను అరికట్టేందుకు సంస్థలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. బ్లాక్ బాక్స్ విధానానికి బదులుగా గ్లాస్ బాక్స్ విధానం అవసరమని ప్రధాని అభిప్రాయపడ్డారు. భద్రతా ప్రమాణాలు ధృవీకరించగలిగే విధంగా పారదర్శక వ్యవస్థ ఉండాలని, జవాబుదారీతనం స్పష్టంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. వ్యాపారాల్లోనూ నైతిక ప్రవర్తనకు ప్రాధాన్యత కల్పించే విధంగా ఏఐ అభివృద్ధి చెందాలని ఆయన పిలుపునిచ్చారు.
— ARUGULA POSHETTYNirmal Dist Staffer
Advertisement