- ఏఐ, డేటా సెంటర్లకు మౌలిక సదుపాయాలపై దృష్టి
- నిరుపేదలకు అందుబాటు ధరల్లో ప్రాణాధార ఔషధాలు
- బయో ఏషియా 23 సదస్సులో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
హైదరాబాద్ సాక్షర: రాష్ట్రంలో ఏఐ మరియు డేటా సెంటర్ల అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రజా ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. జీవశాస్త్ర రంగంలో పరిశోధన, ఆవిష్కరణలకు పెద్దపీట వేస్తూ తక్కువ ఖర్చుతో ఔషధాల అభివృద్ధిని ప్రోత్సహిస్తున్నామని వెల్లడించారు. బయో ఏషియా 23 అంతర్జాతీయ సదస్సులో మాట్లాడిన మంత్రి, నిరుపేదలకు చౌకగా ప్రాణాధార మందులు అందించాలన్నదే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. సాంకేతిక పరిజ్ఞానం, పరిశోధన, పెట్టుబడుల సమన్వయంతో రాష్ట్రాన్ని జీవశాస్త్ర రంగంలో ప్రపంచ స్థాయి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఏఐ ఆధారిత పరిశోధనలు, డేటా ఆధారిత వైద్య పరిష్కారాలు భవిష్యత్ వైద్య రంగానికి దిశానిర్దేశం చేస్తాయని మంత్రి పేర్కొన్నారు. పరిశ్రమలు, శాస్త్రవేత్తలు, విద్యాసంస్థలు కలిసి పనిచేస్తే ఔషధ రంగంలో నూతన ఆవిష్కరణలు సాధ్యమవుతాయని వివరించారు. తెలంగాణను జీవశాస్త్ర, ఔషధ రంగాల్లో అగ్రగామిగా నిలబెట్టడమే లక్ష్యమని అన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల రాష్ట్రంలో పెట్టుబడులు పెరుగుతున్నాయని, యువతకు ఉపాధి అవకాశాలు విస్తరిస్తున్నాయని మంత్రి తెలిపారు. సమగ్ర ప్రణాళికతో జీవశాస్త్ర రంగాన్ని బలోపేతం చేసి ప్రజలకు నాణ్యమైన, అందుబాటు ధరల్లో వైద్య సేవలు అందించేందుకు కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటించారు.
— ARUGULA POSHETTYNirmal Dist Staffer
Advertisement