- సెర్చ్ ఫలితాల్లో టాప్‌లో కనిపించినా జాగ్రత్త
- ఎస్ఈవో, పెయిడ్ ప్రకటనలతో నకిలీ సైట్లు
- అప్రమత్తతే సైబర్ మోసాలకు కవచం
- సీపీ సజ్జనార్ హెచ్చరిక
హైదరాబాద్ సాక్షర: సాంకేతికత పెరిగిన ఈ కాలంలో చిన్న సమాచారం కోసం కూడా సెర్చ్ ఇంజిన్లను ఆశ్రయించడం సాధారణమైందని, అయితే అదే అలవాటు ఇప్పుడు సైబర్ నేరగాళ్లకు ఆయుధంగా మారిందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ హెచ్చరించారు. సెర్చ్ ఫలితాల్లో అగ్రస్థానంలో కనిపించినంత మాత్రాన అది అసలైన, సురక్షితమైన వెబ్‌సైట్ అని నమ్మకూడదని ప్రజలకు సూచించారు. సైబర్ మోసగాళ్లు ఇప్పుడు సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ టెక్నిక్‌లు, చెల్లింపు ప్రకటనలను వినియోగిస్తూ బ్యాంకులు, ప్రభుత్వ పోర్టల్స్, ప్రముఖ వాణిజ్య సంస్థల పేర్లతో అచ్చుగుద్దినట్టు కనిపించే నకిలీ ఫిషింగ్ వెబ్‌సైట్లను సృష్టిస్తున్నారని తెలిపారు. వినియోగదారులు కస్టమర్ కేర్ నంబర్లు లేదా ప్రభుత్వ పథకాల కోసం వెతికినప్పుడు ఈ నకిలీ సైట్లు ముందువరుసలో కనిపించేలా చేస్తున్నారు. అనే గుర్తులను గమనించకపోతే మోసానికి గురయ్యే ప్రమాదం ఉందన్నారు. ఇలాంటి వెబ్‌సైట్లు ఓపెన్ చేసిన వెంటనే వ్యక్తిగత వివరాలు, లాగిన్ సమాచారం, బ్యాంక్ కార్డ్ నంబర్లు, సీవీవీ, ఓటీపీ వంటి సున్నితమైన వివరాలు నమోదు చేయమని కోరుతాయని తెలిపారు. ఆ వివరాలు అందగానే ఖాతాల్లోని డబ్బులు క్షణాల్లో మాయమవుతాయని హెచ్చరించారు. అంతేకాకుండా గుర్తింపు పత్రాల దుర్వినియోగం జరిగి ఐడెంటిటీ దొంగతనం జరిగే ప్రమాదం ఉందన్నారు. ఈ నేపథ్యంలో వెబ్‌సైట్ చిరునామాను జాగ్రత్తగా పరిశీలించాలని, స్పెల్లింగ్ తేడాలను గమనించాలని సూచించారు. తెలిసిన అధికారిక చిరునామాను నేరుగా టైప్ చేసి ఓపెన్ చేయడం సురక్షితమని పేర్కొన్నారు. సైబర్ మోసానికి గురైనట్లు అనిపిస్తే వెంటనే జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కు కాల్ చేయాలని లేదా అధికారిక పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. ఆన్‌లైన్ ప్రపంచంలో అప్రమత్తతే మనకు అసలైన రక్షణ కవచమని సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు.
— ARUGULA POSHETTYNirmal Dist Staffer
Advertisement