భారీ నష్టాలతో స్టాక్ మార్కెట్లు విలవిల....
వ్యాపారం ముగిసే సమయానికి సెన్సెక్స్ సూచీ 1,236 పాయింట్లకు పైగా నష్టపోయి 82,498 స్థాయిలో ముగిసింది. నిఫ్టీ సూచీ 365 పాయింట్లు పడిపోయి 25,454 వద్ద స్థిరపడింది. ఫిబ్రవరి 1 తర్వాత ఇదే అతిపెద్ద ఒక్కరోజు పతనంగా మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితిని పెంచడంతో పెట్టుబడిదారుల విశ్వాసం దెబ్బతిన్నది. దీనికి తోడు బ్యాంకింగ్, వినియోగ వస్తువుల రంగాల్లో లాభాల స్వీకరణ జరగడం అమ్మకాల ఒత్తిడిని మరింత పెంచింది. కీలక మద్దతు స్థాయిని సూచీలు కోల్పోవడంతో సాంకేతికంగా కూడా అమ్మకాలు వేగవంతమయ్యాయని నిపుణులు తెలిపారు. సెన్సెక్స్‌లోని 30 సంస్థల షేర్లన్నీ నష్టాల్లోనే ముగిశాయి. ఇండిగో, మహీంద్రా అండ్ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్, ట్రెంట్ సంస్థల షేర్లు మూడు శాతం వరకు పడిపోయాయి. మధ్య తరహా సంస్థల సూచీ 1.59 శాతం, చిన్న తరహా సంస్థల సూచీ 1.27 శాతం మేర తగ్గాయి. రంగాలవారీగా రియల్ ఎస్టేట్, మీడియా, వాహన రంగాలు అత్యధికంగా రెండు శాతం వరకు నష్టపోయాయి. మరోవైపు విదేశీ పెట్టుబడి సంస్థలు దేశీయ ఈక్విటీ మార్కెట్ నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నాయి. ఫిబ్రవరి తొలి పక్షంలోనే వారు సుమారు రూ.10,956 కోట్ల విలువైన సమాచార సాంకేతిక రంగ షేర్లను విక్రయించినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

