హైదరాబాద్ : మాస్ కా దాస్‌గా గుర్తింపు పొందిన విశ్వక్ సేన్ మరోసారి దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. ఆయన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం కల్ట్. ఇప్పటికే ఆయన తెరకెక్కించిన ఫలక్‌నుమా దాస్, దాస్ కా దమ్కీ చిత్రాలు మంచి స్పందన అందుకున్న నేపథ్యంలో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఉత్కంఠభరితమైన, సాహసోపేతమైన కథాంశంతో ఈ చిత్రం రూపొందుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాతో ఏకంగా 40 మంది కొత్త నటీనటులను వెండితెరకు పరిచయం చేయడం విశేషంగా మారింది. కథానాయికగా గాయత్రి భరద్వాజ్ నటిస్తున్నట్లు సమాచారం. వియత్నాంలో జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా, నేటి యువతను ఆకట్టుకునేలా కథను విశ్వక్ స్వయంగా రాసి తెరకెక్కించినట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, పోస్టర్లు సినిమాపై ఆసక్తిని పెంచాయి. తాజాగా ఈ చిత్రం టీజర్‌ను ఫిబ్రవరి 21న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ చిత్రానికి కేజీఎఫ్ ద్వారా ప్రసిద్ధి చెందిన రవి బస్రూర్ సంగీతాన్ని అందిస్తున్నారు. సంభాషణలను ప్రముఖ దర్శకుడు తరుణ్ భాస్కర్ రాస్తున్నారు. సందీప్ కాకర్ల, కరాటే రాజు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీ, ఆంగ్లం, జపనీస్, స్పానిష్ భాషల్లో కూడా విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఒకే సినిమాతో నలభై మంది కొత్త ముఖాలను పరిచయం చేయడం ద్వారా విశ్వక్ సేన్ మరో వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టినట్లు సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
— ARUGULA POSHETTYNirmal Dist Staffer
Advertisement