- పరిశుభ్రత, మధ్యాహ్న భోజన నాణ్యతపై ఆదేశాలు
- సైన్స్ ల్యాబ్, అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని సూచనలు
- ప్రీ ఫైనల్ పరీక్షల నిర్వహణపై సమీక్ష
- జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్
జగిత్యాల సాక్షర: జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం కల్లూరు గ్రామంలోని తెలంగాణ మోడల్ స్కూల్‌ను జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల పరిసరాల పరిశుభ్రతను కచ్చితంగా పాటించాలని అధికారులకు ఆదేశించారు. పాఠశాల ఆవరణలో పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించి, పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. విద్యార్థులకు వండుతున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన కలెక్టర్, వంటలను గ్యాస్ పొయ్యిపై మాత్రమే వండాలని, కూరగాయలు తాజాగా ఉండాలని, వంట సరుకుల నాణ్యతను ఎప్పటికప్పుడు పరిశీలించాలని ప్రిన్సిపాల్‌కు సూచించారు. అదేవిధంగా కిచెన్ గార్డెన్‌ను వెంటనే ఏర్పాటు చేసి కూరగాయల మొక్కలు పెంచేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తరగతుల్లో ఉపాధ్యాయులు బోధిస్తున్న విధానాన్ని పరిశీలించి, భోజన వసతులపై విద్యార్థులతో నేరుగా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఉన్నత లక్ష్యాలు సాధించాలంటే క్రమశిక్షణతో కూడిన విద్య అవసరమని విద్యార్థులకు సూచించారు. అనంతరం కోరుట్ల పట్టణంలోని జెడ్పి హైస్కూల్ (గర్ల్స్)లో నిర్మాణంలో ఉన్న సైన్స్ ల్యాబ్‌ను పరిశీలించారు. ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ, కాంట్రాక్టర్లతో మాట్లాడి ల్యాబ్ పనులను త్వరితగతిన పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తేవాలని సూచించారు. అలాగే కల్లూరులో ప్రధానమంత్రి శ్రీ పథకంలో భాగంగా జరుగుతున్న ప్రధాన, ఉప పనుల ప్రగతిని సమీక్షించి వారంలోగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు ఆదేశించారు. పాఠశాలలో ఎస్ఎస్సి విద్యార్థులు రాస్తున్న ప్రీ ఫైనల్ పరీక్షల నిర్వహణ తీరును కూడా పరిశీలించారు. పరీక్షలు సక్రమంగా నిర్వహించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల ఆర్డీవో జీవాకర్ రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి రాము, తహసీల్దార్, ఎంపిడివో, ఉపాధ్యాయులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
— ARUGULA POSHETTYNirmal Dist Staffer
Advertisement